Tata Technologies IPO | 19 ఏండ్ల తర్వాత టాటా సన్స్ గ్రూపు సంస్థ ఐపీవోకు వెళుతున్నది. నిధుల సేకరణే లక్ష్యంగా టాటా టెక్నాలజీస్ దాఖలు చేసిన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) అప్లికేషన్‌కు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆమోదం తెలిపింది. టాటా మోటార్స్ సబ్సిడరీ సంస్థగా టాటా టెక్నాలజీస్ పని చేస్తున్నది. 2004 జూలైలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఐపీవో తర్వాత టాటా గ్రూప్ సంస్థ ఐపీవోకు వెళ్లడం ఇదే తొలిసారి.
టాటా టెక్నాలజీస్ నిధుల సేకరణ లక్ష్యం ఎంత అన్నది వెల్లడించకున్నా, మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం కనీసం రూ.4000 కోట్ల నిధులు సేకరించనున్నట్లు తెలుస్తున్నది. జేఎం ఫైనాన్సియల్ లిమిటెడ్, సిటీ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్ సంస్థలు టాటా టెక్నాలజీస్ ఐపీవో లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.
ఐపీవోకు అనుమతించాలని టాటా టెక్నాలజీస్.. గత మార్చిలో సెబీ ముందు దరఖాస్తు చేసింది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా వాటాదారులు తమ 9.57 కోట్ల యూనిట్ షేర్లు (23.60 శాతం పెయిడ్అప్ షేర్ క్యాపిటల్) విక్రయించనున్నారు. టాటా టెక్నాలజీస్ పేరెంట్ సంస్థ టాటా మోటార్స్ 8.11 కోట్ల షేర్లు లేదా 20 శాతం వాటా విక్రయించనున్నది. టాటా మోటార్స్ అనుబంధ సంస్థలు అల్ఫా టీసీ హోల్డింగ్స్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ కంపెనీలు కూడా తమ షేర్లు విక్రయిస్తాయి.
ప్రతిపాదిత ఐపీవోలో 50 శాతం క్వాలిఫయింగ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్, రిటైల్ ఇన్వెస్టర్లు 35 శాతం, నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం షేర్లు కేటాయించారు.టాటా మోటార్స్ అనుబంధ సంస్థగా టాటా టెక్నాలజీస్ పూర్తిగా ఇంజినీరింగ్ సర్వీసుల సంసథగా వ్యవహరిస్తూ వచ్చింది. డిజిటల్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్ పై టాటా టెక్నాలజీస్ ఫోకస్ చేస్తూ వచ్చింది.