Tata Group | న్యూఢిల్లీ, అక్టోబర్ 15: రాబోయే ఐదేండ్లలో తయారీ రంగంలో టాటా గ్రూపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నదని టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. సెమీ కండక్టర్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ, సంబంధిత రంగాల్లో ఈ ఉద్యోగాలు రానున్నాయన్నారు. ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాల్టీ మేనేజ్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడుతూ..తయారీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా అభివృద్ధి చెందిన దేశంగా మారడం అంత సులువుకాదని చెప్పారు.
వ్యాపార రంగం రూపాంతరం చెందుతున్నదని, దీనికి తగ్గట్టుగా టాటా గ్రూపు కూడా పెట్టుబడులను పెంచిందని, ముఖ్యంగా సెమికండక్టర్ల తయారీ, అసెంబ్లింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ, ఇందుకు సంబంధించిన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో వచ్చే ఐదేండ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. అస్సాంలో సెమికండక్టర్ ప్లాంట్‌తోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకోసం ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు.