న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్.. ద్విచక్ర వాహనాల తయారీలోకి రాబోతున్నదని, సంప్రదాయ బైకులతోపాటు విద్యుత్తు ఆధారిత (ఈవీ) టూవీలర్లను మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నదన్న వార్తలు బుధవారం పలు సోషల్ మీడియా వేదికల్లో హల్చల్ చేశాయి. ఇప్పటికే భారీ, మధ్యశ్రేణి, తేలికపాటి వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్ కార్ల తయారీలో దూసుకుపోతున్న టాటా మోటర్స్.. ఇక టూవీలర్ సెగ్మెంట్లోకి ప్రవేశించబోతున్నదని, ఈ క్రమంలోనే ముందుగా 110సీసీ, 125సీసీ బైకులను అందుబాటులోకి తేనుందని జోరుగా ప్రచారం జరుగుతున్నది.

110సీసీ బైక్ ధర రూ.45,999గా, 125సీసీ బైక్ ధర రూ.55,999గా ఉండొచ్చన్న అంచనాలూ వినిపిస్తుండటం గమనార్హం. ఇవి లీటర్ పెట్రోల్‌కు 90 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయనీ అంటున్నారు. అలాగే సింగిల్ చార్జింగ్‌పై 280 కిలోమీటర్లు ప్రయాణించేలా టాటా బ్రాండ్ ఎలక్ట్రిక్ టూవీలర్లూ వస్తాయని చెప్తుండటం విశేషం. అయితే వీటి ధర కేవలం రూ.85,000గానే ఉండొచ్చని ఆయా వెబ్సైట్లు పేర్కొంటున్నాయి. కాగా, హీరో మోటోకార్ప్, హోండా మోటర్‌సైకిల్, బజాజ్, టీవీఎస్‌లకు పోటీగా వచ్చే ఏడాది ఇవి దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తాయని అంచనా.