TCS | న్యూఢిల్లీ, నవంబర్ 9: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. ఖర్చులను నియంత్రించుకోవడంలోభాగంగా సీనియర్ ఉద్యోగులకు అందించనున్న బోనస్లో 20 శాతం నుంచి 40 శాతం వరకు కోత విధించింది. అంతక్రితం త్రైమాసికంలో వేరియబుల్ 70 శాతం వరకు పెంచిన సంస్థ..ఆ మరుసటి త్రైమాసికంలో దీంట్లోనూ కోత పెట్టింది.
జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను జూనియర్ స్థాయి ఉద్యోగులు వేరియబుల్ అలవెన్స్లు అందుకోగా, పలువురు సీనియర్ ఉద్యోగులకు మాత్రం దీంట్లో 40 శాతం వరకు కోత పెట్టినట్లు తెలిసింది. పలు యూనిట్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఆఫీస్ అటెండెన్స్, పనితీరు ఆధారంగా ఉద్యోగికి బోనస్ అందించడం జరుగుతున్నదని, కానీ కొన్ని బిజినెస్ యూనిట్లలో ఉద్యోగుల పనితీరు మెరుగుపడటం లేదని, దీంతో వారికి చెల్లిస్తున్న అదనపు అలవెన్స్లను తగ్గించినట్లు తెలిపారు. జూలై మొదటినాటికి 70 శాతం మంది ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారని, ప్రతివారం వీరి సంఖ్య పెరుగుతున్నది. కంపెనీ చట్టప్రకారం కార్యాలయాలకు వచ్చిన వారికి మాత్రమే పలు వేరియబుల్ చెల్లింపులు జరుపుతున్నది.