Tata Altroz CNG | కార్ల మార్కెట్లో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్ ఇండియాలకు టాటా మోటార్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మార్కెట్ వాటా పెంచుకునేందుకు సీఎన్జీ వేరియంట్ కార్ల విస్తరణ దిశగా టాటా మోటార్స్ అడుగులేస్తున్నది. అందులో భాగంగా బుధవారం దేశీయ మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వర్షన్ రానున్నది. ప్రత్యేకించి మారుతి సుజుకిలో పాపులర్ ఎస్యూవీ బాలెనో సీఎన్జీ వేరియంట్‌తో నువ్వా.. నేనా.. అన్నట్లు టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్ పోటీ పడుతుందని భావిస్తున్నారు. ఐసీఎన్జీ టెక్నాలజీతో మార్కెట్లోకి వస్తున్న టాటా మోటార్స్ మూడో హ్యాచ్ బ్యాక్ కారు ఆల్ట్రోజ్ కానున్నది. గతేడాది టైగోర్ సెడాన్, టియాగో హ్యాచ్ బ్యాక్ కార్లను సీఎన్జీ వేరియంట్లో మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బుల్లి ఎస్యూవీ పంచ్ సీఎన్జీ వేరియంట్ కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే దేశీయ మార్కెట్లోకి దూసుకొచ్చింది.
ఐసీఈ అవతార్‌లో వస్తున్న టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ బూట్ స్పేస్‌లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశంలోనే తొలిసారి న్యూ ట్విన్-సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో టాటా మోటార్స్ తన ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారును తీసుకొస్తున్నది. అయినప్పటికీ ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు 1.2 లీటర్ల నాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. టియాగో సీఎన్జీ, టైగోర్ సీఎన్జీ మోడల్ కార్లలోనూ 1.2 లీటర్ల నాచురల్లీ- ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఉంది.
టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్ ఇంజిన్ మాన్యువల్ గేర్ బ్యాక్స్ కలిగి ఉంటుంది. ఐసీఎన్జీ మోడ్ ఇంజిన్ 73 బీహెచ్పీ విద్యుత్, 95 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. విత్ఔట్ సీఎన్జీ కిట్ ఇంజిన్ 84.82 బీహెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. కిలో సీఎన్జీ గ్యాస్‌పై టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ 27 కి.మీ. మైలేజీ ఇస్తుంది.
పెట్రోల్ వేరియంట్ టాటా ఆల్ట్రోజ్ కంటే సీఎన్జీ వేరియంట్ కారు ధర సుమారు రూ.80 వేలు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. స్టాండర్డ్ టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్ కారు ధర రూ.6.45 లక్షల నుంచి ప్రారంభమైంది. ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ వేరియంట్ కారు ధర దాదాపు రూ.7.50 లక్షల నుంచి హయ్యర్ వేరియంట్ ధర రూ.10 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ వేరియంట్ కారు ధర రూ.9.28 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.