మళయాళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి హేమ కమిటీ నివేదిక కఠోర వాస్తవాలను వెలుగులోకి తేవడం పెను దుమారం రేపింది. హేమ కమిటీ నివేదికపై బీజేపీ నేత తమిళిసై సౌందర్‌రాజన్ చెన్నైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హేమ కమిటీ నివేదిక సినీ పరిశ్రమలో మహిళల పరిస్ధితులను కండ్లకు కట్టిందని, దీనిపై సర్వత్రా ఆందోళన నెలకొంటే సినీ పరిశ్రమ ఎందుకు కమిటీని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
మహిళలు ఎక్కడ పనిచేసినా వారికి భద్రత కల్పించాలని అన్నారు. మహిళలు తమ సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు ఓ వేదిక అవసరమని చెప్పారు. తమిళనాడులో కనీసం మహిళా పోలీస్ అధికారికి కూడా భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు భద్రత అవసరం లేదని సీఎం స్టాలిన్ ఆలోచన కావడంతో తనకు కూడా భద్రతను తొలగించారని తమిళిసై పేర్కొన్నారు.
కాగా, మహిళలు పనిచేసే చోట వేధింపుల నుంచి వారిని కాపాడాల్సిన అవసరం ఉందని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. తమకు భద్రత కల్పించాలని మహిళలు కోరడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె పేర్కొన్నారు. కనిమొళి బుధవారం చెన్నైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహిళలపై ఏ రకమైన వేధింపులు జరగకుండా నిరోధించడం ముఖ్యమని చెప్పారు. పని ప్రదేశాల్లో మహిళలను కాపాడుకోవాలని ఇది మనందరి కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు.
Read More :
Harish Shankar | ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్.. నిర్మాతకు రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చిన హరీష్ శంకర్.?