హైదరాబాద్, మార్చి 22(నమస్తే తెలంగాణ): తైవాన్‌కు చెందిన సెరా నెట్వర్క్స్ మరో భాగస్వామితో కలిసి హైదరాబాద్‌కు సమీపంలో కొంగరకలాన్ వద్ద నెలకొల్పిన ఈ-సిటీలో భారీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకొచ్చింది. రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ యూనిట్‌తో 2 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం తైవాన్‌లో పర్యటనలో ఉన్న అధికారుల బృందం ఈ యూనిట్ ఏర్పాటుపై అవగాహన ఒప్పందం కుదిరింది. టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తైవాన్ వెళ్ళిన అధికారులతో సెరా నెట్వర్స్, హైదరాబాద్‌కు చెందిన రిసొల్యూట్ అప్లయెన్సెస్ తొలుత భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాయి.
ఈ రెండు సంస్థలు ఈ -సిటీలో ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల్లో అత్యాధునిక డాటా సెంటర్ స్విచ్చులు, 5జీ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలతో పాటు, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నాయి.