పుణె, జూలై 15: వ్యవసాయ రంగానికి మరింత సాంకేతికతను జోడిస్తున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన అగ్రోకెమికల్ దిగ్గజం సింజెంటా.. దేశవ్యాప్త ‘డ్రోన్ యాత్ర’ను శుక్రవారం ప్రారంభించింది. తెలంగాణసహా 13 రాష్ర్టాల్లో 10వేల కిలోమీటర్లు ఇది సాగనున్నది. డ్రోన్ల ద్వారా పురుగు మందుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమానికి సింజెంటా శ్రీకారం చుట్టింది. వచ్చే 3 నెలల్లో ఈ డ్రోన్ యాత్ర ఆయా రాష్ర్టాల్లో జరుగుతుంది. ఓ వ్యాన్ ద్వారా మహారాష్ట్రలో మొదలై.. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలకు వెళ్తుంది. వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీలదే భవిష్యత్తు అని ఈ సందర్భంగా సింజెంటా భారతీయ విభాగం అధిపతి, సంస్థ ఎండీ సుశీల్ కుమార్, సింజెంటా గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్, డిజిటల్ ఆఫీసర్ ఫిరోజ్ షేక్‌లు అన్నారు. యాత్రలో 10వేల మంది రైతులను కలుస్తామని చెప్పారు.
వరి, పత్తి, సోయాబీన్ కోసం..
వరి, పత్తి, సోయాబీన్ పంటల కోసం ఈ నెలాఖర్లో డ్రోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు సింజెంటా ఎండీ సుశీల్ కుమార్ తెలిపారు. పంటలపై ఈ డ్రోన్లను వినియోగించి పురుగు మందులను స్ప్రే చేయవచ్చని చెప్పారు. సింజెంటా పురుగు మందు ‘అమిస్టర్’ను వరి పంటపై డ్రోన్ ద్వారా స్ప్రే చేయడానికి సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు ఇప్పటికే అనుమతిచ్చింది.
9 పంటలపై సూచనలు
ఈ నెలాఖర్లో దేశంలో ఓ గ్రోయర్ యాప్‌ను తెచ్చే యోచనలో సింజెంటా ఉన్నది. దీనిద్వారా పత్తి, గోధుమ, కాయగూరలు, వరి, మొక్కజొన్న తదితర 9 పంటలపై చిన్న, సన్నకారు రైతులకు డిజిటల్ అగ్రోనామీ సలహాలు ఇవ్వనున్నది. ఇదిలావుంటే పంటల సాగులో రైతుల సాధికారతకు దోహదం చేసేలా ప్రపంచంలోనే తొలి బయోడైవర్సిటీ సెన్సార్ టెక్నాలజీని సంస్థ అభివృద్ధి చేసింది. ఐరోపా దేశాలతోపాటు భారత్‌లో దీన్ని ఈ ఏడాది పరీక్షిస్తామని సింజెంటా చెప్తున్నది.