Swiggy | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ అండ్ క్విక్ కామర్స్ మేజర్ ‘స్విగ్గీ (Swiggy)’ దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగయిన మరునాడు గురువారం దాదాపు ఆరు శాతం నష్ట పోయింది. బీఎస్ఈలో 5.72 శాతం నష్టంతో రూ.429.85 పలికింది. ఇంట్రాడే ట్రేడింగ్లో స్విగ్గీ షేర్ 8.18 శాతం నష్టపోయి రూ.418.65లకు పడిపోయింది. మరోవైపు, ఎన్ఎస్ఈలో 5.54 శాతం పతనంతో రూ.430.70 వద్ద ముగిసింది. దీంతో స్విగ్గీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,842.35 కోట్ల నష్టంతో రూ.96,219.66 కోట్లకు చేరుకున్నది.
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన స్విగ్గీ షేర్ విలువ రూ.390 కాగా, దాదాపు 17 శాతం వృద్ధి చెందింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్క్ దాటేసింది. రూ.11,327 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఐపీఓకు వెళ్లిన స్విగ్గీ షేర్లకు గత శుక్రవారం ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఐపీఓ చివరి రోజు స్విగ్గీ షేర్లకు 3.59 రెట్లు సబ్ స్క్రిప్షన్లు లభించాయి. తాజా వాటాల జారీ ద్వారా రూ.4,499 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.6,828 కోట్ల నిధులు సేకరించాలని స్విగ్గీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇలా సేకరించిన నిధులను క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, బ్రాండ్ మార్కెటింగ్, బిజినెస్ ప్రమోషన్, డెట్ పేమెంట్స్ కోసం ఉపయోగిస్తామని స్విగ్గీ తెలిపింది.