Swiggy IPO | ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ మేజర్ స్విగ్గీ ఐపీఓకు తొలిరోజు ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. బుధవారం 12 శాతం షేర్లు మాత్రమే సబ్ స్క్రిప్షన్ అయ్యాయి. 16,01,09,703 షేర్లకు గాను 1,89,80,620 షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయని ఎన్ఎస్ఈ డేటా చెబుతోంది. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 54 శాతం సబ్ స్క్రిప్షన్ లభించగా, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఆరు శాతం మంది మాత్రమే బిడ్లు ఫైల్ చేశారు. యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా మంగళవారం రూ.5,085 కోట్ల నిధులు సేకరించినట్లు మంగళవారం తెలిపింది.
నవంబర్ ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ స్విగ్గీ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ నడుస్తుంది. ఐపీఓలో స్విగ్గీ షేర్ ధర రూ.371 నుంచి రూ.390 మధ్య ప్రతిపాదించింది. ఐపీఓ ద్వారా రూ.11,327 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది స్విగ్గీ. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.6,828 కోట్లు, తాజా షేర్ల జారీ ద్వారా రూ.4,499 కోట్ల నిధులు సేకరించనున్నది. తాజాగా సేకరించిన నిధులను టెక్నాలజీ, క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, బ్రాండ్ మార్కెటింగ్, బిజినెస్ ప్రమోషన్, డెట్ పేమెంట్ కోసం ఖర్చు చేస్తామని ఇప్పటికే స్విగ్గీ వెల్లడించింది.