Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ జెయింట్ ‘స్విగ్గీ’ వచ్చేవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నది. ఈ నెల ఆరో తేదీన ఐపీఓ ద్వారా దలాల్ స్ట్రీట్ లో అడుగు పెట్టనున్నది. సాఫ్ట్ బ్యాంక్ మద్దతుతో పని చేస్తున్న స్విగ్గీ.. రూ.11 వేల కోట్ల నిధులు సేకరించాలన్న లక్ష్యంతో వస్తోంది. నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ నార్గెస్ అండ్ ఫైడెలిటీ వంటి పలు ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు స్విగ్గీ ఐపీఓలో 15 బిలియన్ డాలర్లకు పైగా వాటాలకు బిడ్లు దాఖలు చేయనున్నాయని సమాచారం. ఇటువంటి ఇన్వెస్టర్ల కోసం స్విగ్గీ రిజర్వు చేసిన 605 మిలియన్ డాలర్ల కంటే ఇది 25 రెట్లు అధికం.
స్విగ్గీ ఐపీఓ ఈ నెల ఆరో తేదీన ప్రారంభమై ఎనిమిదో తేదీన ముగుస్తుంది. స్విగ్గీ షేర్ విలువ రూ.371-390 మధ్య ఉంటుంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.11,327.43 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో 11.54 కోట్ల ఈక్విటీ షేర్లతో రూ.4,499 కోట్ల నిధులు తాజా షేర్ల జారీ, రూ.6,828.43 కోట్ల నిధులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 17.51 కోట్ల షేర్ల విక్రయం ద్వారా సేకరించ తలపెట్టింది స్విగ్గీ. ఐపీఓలో సబ్ స్క్రిప్షన్ కోసం బిడ్ దాఖలు చేసే వారు కనీసం 38 షేర్లు కొనుగోలు చేసి రూ.14,820 పెట్టుబడి పెట్టాలి.
స్విగ్గీ ఐపీఓలో సుమారు 75 శాతం షేర్లు క్వాలిఫైడ్ ఇన్ స్ట్యూషనల్ బిడ్డర్లు, 15 శాతం నాన్ ఇన్ స్ట్యూషనల్ ఇన్వెస్టర్లు, 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వు చేశారు. కంపెనీ ఉద్యోగులకు నిర్ణయించిన షేర్ విలువపై రూ.25 డిస్కౌంట్ తో 7.50 లక్షల షేర్లు రిజర్వు చేసింది. ఈ నెల 11న స్విగ్గీ ఐపీఓ అలాట్ మెంట్, 13న దేశీయ స్టాక్ మార్కెట్లలో స్విగ్గీ షేర్లు లిస్టింగ్ అవుతాయి. ఈ నెల 12న బిడ్లు దాఖలు చేసిన ఇన్వెస్టర్ల డీ-మ్యాట్ ఖాతాల్లోకి స్విగ్గీ క్రెడిట్ చేస్తుంది.