Swiggy – Bolt | ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. బెంగళూర్ కేంద్రంగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్న యాప్ ‘స్విగ్గీ (Swiggy)’ తన సేవలను విస్తరిస్తోంది. తన పది నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ ‘బోల్ట్’ సేవలను దేశంలోని 400 పై చిలుకు నగరాలకు విస్తరిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి దశలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, పుణె నగరాల్లో స్విగ్గీ తన బోల్ట్ సేవలను ప్రారంభించింది. క్విక్ కామర్స్ డార్క్ స్టోర్స్ గల జెప్టో (Zepto) గత నెలలో లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ తో కేఫ్ బిజినెస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరులోనే స్విష్ (Swish)’ అనే పది నిమిషాల ఫుడ్ డెలివరీ యాప్.. బెంగళూరు నగర పరిధిలోనూ, ఇతర ప్రథమ శ్రేణి నగరాల్లో సేవల విస్తరిస్తోంది. ఇందుకోసం ఎసెల్ నుంచి 20 లక్షల డాలర్ల సీడ్ ఫండ్ సేకరించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బోల్ట్ సేవలకు ఆదరణ ఎక్కువగా ఉంటుందని స్విగ్గీ వెల్లడించింది. తర్వాత హర్యానా, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల పరిధిలో బోల్ట్ సేవలకు కస్టమర్ల నుంచి ఆదరణ ఉందని వివరించింది.
తక్కువ సమయంలో తయారయ్యే ఆహార పదార్థాలను మాత్రమే బోల్ట్ కింద డెలివరీ చేస్తామని స్విగ్గీ తెలిపింది. ఈ తరహా ఆర్డర్లకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా సంబంధిత రెస్టారెంట్లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వివరించిది. డెలివరీ బాయ్స్ భద్రతను దృష్టిలో పెట్టుకుని సాధారణ, బోల్ట్ ఆర్డర్ల డెలివరీ గురించి తెలియజేయడం లేదని పేర్కొంది. ప్రస్తుతం రెండు కి.మీ పరిధిలో మాత్రమే బోల్ట్ సేవలను పరిమితం చేశామని, భవిష్యత్ లో విస్తరిస్తామని వివరించింది. ఈ బోల్ట్ ఆర్డర్ల డెలివరీ కోసం డెలివరీ బాయ్స్‌కు ఎటువంటి అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదని స్పష్టం చేసింది.