Online Food Delivery | పాత సంవత్సరం 2021కి గుడ్‌బై చెప్పేశాం.. కోటి ఆశలతో నూతన సంవత్సరం 2022కు స్వాగతం పలికాం.. నూతన సంవత్సర వేడుకలంటే పార్టీలు.. డ్యాన్స్‌లు.. రకరకాల వేడుకలు.. గతేడాది కరోనా ప్రభావంతో కళ తప్పిన నూతన సంవత్సర సంబురాలు.. ఈ ఏడాది మహమ్మారి న్యూవేరియంట్ ఒమిక్రాన్ వల్ల కళ తప్పాయి. కానీ సంబురాలు చేసుకోవాలంటే బయటకే వెళ్లనక్కర్లేదు.. ఇప్పుడు ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఫుడ్ డెలివరీ యాప్‌లు క్షణాల్లో డెలివరీ చేసేస్తాయి.
పలువురు నూతన సంవత్సర వేడుకలు భిన్నంగా జరుపుకోవాలనుకున్నారు. కొత్త ఏడాదికి వెల్కం చెప్పేందుకు వంటింటి వంటకానికి తాత్కాలికంగా సెలవిచ్చారు.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు చేశారు. దీంతో ఫుడ్ డెలివరీ యాప్‌లకు పంట పండింది. శుక్రవారం రాత్రి నుంచే ఫుడ్ ఆర్డర్లకు గిరాకీ పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ స్విగ్గీ యాప్‌కు ఏకంగా నిమిషానికి 9000 డెలివరీలు.. జొమాటోకు నిమిషానికి 8వేల మందికి పైగా ఆహారం ఆర్డర్ చేసుకున్నట్లు ఆయా యాప్‌లు వెల్లడించాయి.
నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ 20లక్షలకు పైగా ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ట్వీట్ చేసింది. ఫుడ్ ఆర్డర్లలో గతేడాది సాధించిన సొంత రికార్డును బద్దలుకొట్టినట్లు తెలిపింది. గతేడాది న్యూఇయర్ సందర్భంగా స్విగ్గీకి నిమిషానికి 5500 ఆర్డర్లు రాగా.. ఈ ఏడాది ఏకంగా 9049 ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. ఇక నిమిషానికి 1229 బిర్యానీలను డెలివరీ చేసినట్లు తెలిపింది. స్విగ్గీలో చికెన్ బిర్యానీ, బటర్ నాన్, మసాలా దోశ, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్‌కు అత్యధిక ఆర్డర్లు వచ్చినట్లు చెప్పింది.
అటు మరో డెలివరీ యాప్ జొమాటో నుంచి కూడా 20లక్షలకు పైగా మంది ఆహారాన్ని ఆర్డర్ చేసుకున్నారు. ఒక రోజులో 20లక్షలకు పైగా ఆర్డర్లు రావడం ఇదే తొలిసారని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ట్వీట్ చేశారు. కాగా, శనివారం నుంచి ఫుడ్ డెలివరీ యాప్స్‌పై ఆర్డర్లు చేస్తే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.