SVB Group | న్యూయార్క్, మార్చి 10: అమెరికాకు చెందిన అతిపెద్ద కమర్షియల్ బ్యాంకుల్లో ఒకటైన ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూపు ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటుందా! సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సేవలు అందిస్తున్న ఈ సంస్థ 1.75 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించనున్నట్లు ప్రకటించడంతో వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక్కసారి కుదుపునకు గురైంది. మరోసారి ఆర్థిక సంక్షోభం రాబోతున్నదన్న భయాలు చుట్టుముట్టడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ దెబ్బకు 80 బిలియన్ డాలర్ల విలువైన సంపద కరిగిపోయింది. గ్రూపునకు చెందిన షేర్లతోపాటు బాండ్లు కూడా భారీగా పడిపోయాయి. దీంతో బ్యాంక్ షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అత్యధిక స్టార్టప్‌లలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన ఈ ఎస్వీబీ గ్రూపునకు స్టార్టప్ పెట్టుబడులు నష్టాలనే తెచ్చాయి. దీంతో వీటిని తీర్చడానికి షేర్లను అమ్మకానికి పెట్టింది.
ఎస్వీబీ సంక్షోభం మరో లెహమాన్ బ్రదర్స్‌ను తలపించేలా ఉన్నదా! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లెహమాన్ బ్రదర్స్ లేదా ఎన్రోన్ కార్పొరేషన్ సంక్షోభం కానున్నదని ఆర్థిక వేత్తలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఒకవైపు వడ్డీరేట్లు పెరుగుతుండటంతో తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించలేని స్థాయికి ఎస్వీబీ పడిపోయే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు. గడిచిన ఏడాదికాలంలో అమెరికాలో వడ్డీరేట్లు 500 బేసిస్ పాయింట్లు పెరిగినట్లు ఉదయ్ కొటక్ పేర్కొన్నారు.
అమెరికాలో చెలరేగిన ఈ సంక్షోభం భారత్‌పై ప్రభావం చాలా తక్కువ చూపనున్నదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎస్వీబీ స్టాక్, అమెరికా మార్కెట్లు పతనం చెందడంతో దలాల్ స్ట్రీట్‌లో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురైనప్పటికీ తిరిగి కోలుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తేలడంతో ది సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) కార్యకలాపాలను నిలిపివేసింది అక్కడి రెగ్యులేటరీ. దీంతోపాటు బ్యాంక్‌కు చెందిన ఆస్తులను స్వాధీ నం చేసుకున్నట్లు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ) శుక్రవారం తెలిపింది. బ్యాంక్ వద్ద 209 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తు లు, 175.4 బిలియన్ డాలర్ల విలువైన డిపాజిట్లు ఉన్నప్పటికీ తిరిగి చెల్లింపులు జరపడంలో విఫలమైంది.