SEBI | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్‌లో అవకతవకల ఉదంతంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చేపడుతున్న దర్యాప్తునకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ నిర్ణయించింది. ఆగస్టు 14 లోపు ఈ అంశంపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అదానీ వివాదంపై దర్యాప్తునకు సెప్టెంబర్ చివరి వరకూ సమయం ఇవ్వాలంటూ సెబీ తరుఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కోర్డు.. నిరవధికంగా సమయాన్ని పొడిగిస్తూ కూర్చోలేమని తేల్చిచెప్పింది. దర్యాప్తులో నిజంగా ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. నిపుణుల కమిటీ ఇప్పటికే సమర్పించిన నివేదికను క్షుణ్ణంగా విశ్లేషించడానికి కేసు విచారణను జూలై 11కు వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది.
అనుమానాస్పదంగా సెబీ తీరు!
అదానీ-హిండెన్‌బర్గ్ ఉదంతంపై సుప్రీం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల కమిటీతో పాటు సెబీ రెండు నెలల క్రితమే దర్యాప్తును వేర్వేరుగా ప్రారంభించాయి. డెడ్‌లైన్ కంటే ముందే నిపుణుల కమిటీ సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదికను సమర్పించింది. అయితే, దర్యాప్తునకు తమకు మరో ఆరు మాసాల సమయం కావాలంటూ సెబీ కోర్టును కోరడం అనుమానాలకు తావిస్తున్నది.