Vishal Mega Mart IPO | దేశవ్యాప్తంగా సూపర్మార్ట్లను నిర్వహిస్తున్న విశాల్ మెగా మార్ట్ (Vishal Mega Mart) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) తేదీలు వచ్చేశాయి. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.8,000 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్న విశాల్ మెగా మార్ట్ ఐపీఓ ఈ నెల 11న ప్రారంభం అవుతుంది. 13న ముగుస్తుంది. ఈ నెల 10న యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ కు అనుమతిస్తారని సమాచారం. ఇక ఐపీఓ ధరల శ్రేణిని విశాల్ మెగా మార్ట్ వెల్లడించాల్సి ఉంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో విశాల్ మెగా మార్ట్ ఐపీఓ జరుగుతుంది.
ఈ ఐపీఓ ద్వారా విశాల్ మెగా మార్ట్ ప్రమోటర్ సంస్థ సమయత్ సర్వీసెస్ ఎల్ఎల్పీ తన వాటాలు విక్రయించనున్నది. విశాల్ మెగా మార్ట్ సంస్థలో సమయత్ సర్వీసెస్ ఎల్ఎల్పీకి 96.55 శాతం వాటా ఉంది. తాజాగా విశాల్ మెగా మార్ట్ కొత్త వాటాలు జారీ చేయడం లేదు. కనుక మార్కెట్ల నుంచి సేకరించిన నిధులు పూర్తిగా వాటాదారులకే చేరుతాయి. విశాల్ మెగా మార్ట్ ఐపీఓకు గత సెప్టెంబర్ 25న సెబీ అనుమతి ఇచ్చింది.
మధ్య, దిగువ మధ్య తరగతి వినియోగదారులే లక్ష్యంగా దేశంలోని వివిధ నగరాల్లో సూపర్ మార్ట్లు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 626 స్టోర్లు నిర్వహిస్తున్నదీ సంస్థ. మొబైల్ యాప్, వెబ్ సైట్ ద్వారా విక్రయిస్తున్నది. తమ రిటైల్ స్టోర్లలో ఇన్ హౌస్ తోపాటు థర్డ్ పార్టీ బ్రాండ్ల వస్తువులు కూడా అమ్ముతున్నది. ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జెఫ్రీస్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్, జేపీ మోర్గాన్ ఇండియా లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.