Sugar Price | భారత్లో ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి భారీ తగ్గింది. మొత్తం ఉత్పత్తి 27 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. గత సంవత్సరం 31.8 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే గణనీయంగా తగ్గింది. ఈ విషయాన్ని సెంట్రమ్ (Centrum) నివేదికలో పేర్కొంది. ఫిబ్రవరి 15, 2025 నాటికి దేశంలో చక్కెర ఉత్పత్తి 19.77 ఎంఎంటీ కాగా.. గత సీజన్ ఇదే సమయానికి కంటే 12శాతం తక్కువ. చక్కెర ఉత్పత్తి తగ్గుదలకు ప్రధాన కారణం ఇథనాల్ ఉత్పత్తికి ఎక్కువగా చెరకును ఉపయోగించడం కారణంగా.. చక్కెర ఉత్పత్తికి కొరత ఏర్పడింది. నివేదిక ప్రకారం.. రాష్ట్రాల వారీగా చక్కెర ఉత్పత్తిని పరిశీలిస్తే.. మహారాష్ట్రలో భారీగా ఉత్పత్తి తగ్గింది. ఏకంగా 14శాతం ఉత్పత్తి పడిపోయింది. కర్ణాటకలో 13శాతం, ఉత్తరప్రదేశ్లో 8శాతం తగ్గుదల నమోదైంది.
గతపక్షం రోజుల్లో కర్ణాటకలో చెరకు లభ్యత 22శాతం తగ్గింది. మహారాష్ట్రలో చెరకు లభ్యత గత సంవత్సరంతో పోలిస్తే 7.8 శాతం తగ్గింది. అయితే, ప్రస్తుత సీజన్లో యూపీలో చెరకు లభ్యత 1.4 శాతం పెరుగుదలతో స్థిరంగానే ఉన్నది. చెరకు సరఫరా తగ్గడంతో అనేక మిల్లులు ఊహించిన సమయం కంటే ముందుగానే క్రషింగ్ కార్యాకలాపాలను నిలిపివేశాయి. జనవరి 31 నాటికి 23 మిల్లులు క్రషింగ్ను ఆపగా.. ఫిబ్రవరి 15 నాటికి ఈ సంఖ్య 51కి చేరింది. ప్రస్తుత సీజన్లో చెరకు క్రషింగ్ 4.5శాతం తగ్గి 218 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. గత సీజన్లో 228 ఎంఎంటీలుగా ఉన్నది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బియ్యం ధరల పెంపును ఉపసంహరించుకుంది. కిలోకు రూ.22.5గా నిర్ణయించింది.
మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ధరలను మార్చడంతో వ్యాపారులు నిరాశకు గురయ్యారు. ఎందుకంటే బీ-హెచ్వీ (BH), ప్రత్యక్ష ఇథనాల్ ఉత్పత్తిలో విస్తృత పెరుగుదల అంచనాలకు విరుద్ధంగా.. సీ-హెవీ (CH) మార్గంలో మాత్రమే 3 శాతం ధర పెరుగుదల కనిపించింది. పరిశ్రమ నిపుణుల సూచనల ప్రకారం.. మిల్లులు సీహెచ్ ఆధారిత ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా చక్కెర ఉత్పత్తి పెరిగి.. ఇథనాల్ ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గినప్పటికీ చక్కెర ధరలు స్థిరంగా, లాభదాయకంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో చక్కెర ధరలు టన్నుకు రూ.41వేలు ఉండా.. మహారాష్ట్రలో టన్నుకు రూ.37,500 కంటే ఎక్కువగా ఉన్నది. ప్రభుత్వం ఇటీవల ఒక ఎంఎంటీ చక్కెర కోటా ఎగుమతికి ఆమోదించిన నేపథ్యంలో వచ్చే ఏడాది దేశీయంగా ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.