ChatGPT | గత కొన్ని రోజులుగా టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌జీపీటీ (ChatGPT) చాట్‌బోట్ సృష్టిస్తున్న సంచలనాలు అంతా ఇంతా కాదు.. ఒకానొక దశలో అత్యాధునిక చాట్‌జీపీటీ వ్యవస్థల అభివృద్ధి నిలిపేయాలన్న అభ్యర్థనలు వెలువడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై సెర్చింజన్ `గూగుల్`తో నువ్వా.. నేనా.. అన్నట్లు తల పడుతున్నది `చాట్‌జీపీటీ (ChatGPT)`. దీనికి పోటీగా గూగుల్, అమెజాన్, మెటా సహా టెక్నాలజీ సంస్థలన్నీ పోటీ చాట్బోట్ల అభివృద్ధిపై దృష్టి సారించాయి. కానీ.. అకౌంటింగ్ విభాగంలో ఈ టెక్నాలజీ టూల్ చతికిల పడింది.. అదీ విద్యార్థులతో పోటీ పడలేకపోయింది.
అకౌంటింగ్ విభాగంలో నిర్వహించిన పరీక్షలో చాట్‌జీపీటీ 47.4శాతం మార్కులు పొందితే, విద్యార్థులు సరాసరి 76.7 శాతం మార్కులు పొందారు. అయినా చాట్‌జీపీటీ పనితీరు అందరినీ ఆకట్టుకున్నదని రీసెర్చర్లు అభిప్రాయ పడ్డారు. బోధన, లెర్నింగ్ విధానాలను మార్చే గేమ్ చేంజర్ ఈ చాట్‌జీపీటీ అని పేర్కొన్నారు. ఈ విషయమై జరిగిన పరిశోధన మీద ‘ఇష్యూస్ ఇన్ అకౌంటింగ్ ఎడ్యుకేషన్’ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది.
అకౌంటింగ్ విభాగంలో చాట్‌జీపీటీ ఎంత మేరకు రాణిస్తుందో అంచనా వేయడానికి అమెరికాలోని బ్రిగ్హమ్ యంగ్ యూనివర్సిటీతోపాటు 14 దేశాలకు చెందిన 186 యూనివర్సిటీల నుంచి 327 మంది రీసెర్చ్ విద్యార్థులు సిద్ధమయ్యారు. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), అడిటింగ్, ఫైనాన్సియల్ అకౌంటింగ్, ఫైనాన్స్, టాక్స్, మేనేజీరియల్ అకౌంటింగ్ తదితర అంశాలపై తప్పొప్పులు, సంక్షిప్త సమాధానాలపై ప్రశ్నలు, మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల రూపేణా 27 వేలకు పైగా విభిన్న ప్రశ్నలు తయారు చేశారు.
ఈ పరీక్షలో విద్యార్థులు సగటున 76.7 శాతం మార్కులు సాధించినా.. 11.3 శాతం ప్రశ్నలకు మాత్రం విద్యార్థుల సగటు మార్కుల కంటే చాట్‌జీపీటీ ఎక్కువ మార్కులు పొందింది. ఏఐఎస్, అడిటింగ్ విభాగాల్లో రాణించిన చాట్‌జీపీటీ.. ట్యాక్స్, ఫైనాన్స్, మేనేజీరియల్ అకౌంటింగ్లో వెనుకబడింది. మల్టీఫుల్ చాయిస్ ప్రశ్నలకు 59.5 శాతం, తప్పొప్పుల్లో 68.7 శాతం కరక్ట్ సమాధానాలు ఇచ్చినా.. సంక్షిప్త ప్రశ్నలకు 28.7-39.1 శాతం మధ్య సరిగ్గా జవాబులు ఇచ్చింది. తీసివేతలకు బదులు కూడికలు, బాగాహారం లెక్కలు తప్పుగా చేసినట్లు తేలింది.
ఉన్నత స్థాయి ప్రశ్నలకు చాట్‌జీపీటీ జవాబులు ఇవ్వడం కష్టం అని ప్రధాన అధ్యయన కర్త, బ్రిగ్ హమ్ యంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ వుడ్ చెప్పారు. తన జవాబులపై తరుచుగా వివరణలు.. కొన్నిసార్లు తప్పుడు జవాబులకు వివరణ ఇస్తున్నదని తెలిపారు. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలకు కొన్ని సార్లు సరైన వివరణ ఇచ్చినా తప్పుడు జవాబులు ఇచ్చిందని పరిశోధకులు చెప్పారు. తన జవాబులకు కృత్రిమంగా రిఫరెన్స్‌లు తయారు చేసిందని గుర్తించారు. అకౌంటింగ్‌పై చాట్‌జీపీటీ పనితీరు పట్ల మరింత రీసెర్చ్ చేస్తామని డేవిడ్ వుడ్ తెలిపారు.