Share Market | భారత ఈక్విటీ మార్కెట్లో ఈ వారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ (FPIs) భారీగా పెట్టుబడులు పెట్టారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ప్రకారం.. జూన్ 23 నుంచి జూన్ 27 వారంలో విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లో రూ.13,107.54 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడి భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల బలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నది. విదేశీ పెట్టుబడిదారులు ముఖ్యంగా సోమవారం-శుక్రవారం మధ్య మార్కెట్లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగినట్లుగా డేటా పేర్కొంటున్నది. ఈ కొత్త పెట్టుబడులతో జూన్లో మొత్తం నికర పెట్టుబడి ఇప్పుడు రూ.8,915 కోట్లకు చేరుకున్నది.
అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో పెట్టుబడులు వచ్చి చేరాయి. కాల్పుల విరమణ తర్వాత ప్రపంచ మార్కెట్లో సెంటిమెంట్ బలపడింది. ఇది భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల వైపు సానుకూలంగా చూసేలా విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించింది. బలమైన దేశీయ ఫండమెంటల్స్ ఈ కొత్త ధోరణికి దన్నుగా నిలుస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం విధితమే. ఇది ఆర్థిక వృద్ధిని పెంచుతుందని భావిస్తున్నారు. అలాగే, దేశంలో ద్రవ్యోల్బణం తక్కువగానే ఉన్నది. దాంతో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలపరిచింది. మే ప్రారంభంలోనూ విదేశీ పెట్టుబడులు సానుకూలంగా ఉండగా.. రూ.19,860 కోట్లుగా ఉన్నాయి.