న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన కోల్ ఇండియాలో సమ్మె సైరన్ మోగింది. నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల వేతన సవరణ చేయకపోవడాన్ని నిరసిస్తూ మూడు రోజులపాటు సమ్మె చేయనున్నట్టు భారతీయ మజ్దూర్ సంగ్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌తోపాటు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. జాతీయ బొగ్గు వేతన అగ్రిమెంట్(ఎన్సీడబ్ల్యూఏ) ఎక్స్ఐ నిబంధనలకు లోబడి నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం లేదని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి.
అక్టోబర్ 5 నుంచి 7 వరకు నిర్వహించనున్న ఈసమ్మెకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు బీఎంఎస్, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ సమ్మెపై ఇప్పటికే చీఫ్ లేబర్ కమిషనర్‌కు సమాచారం అందించారు కూడా. ఉద్యోగ సంఘాలు సమ్మె చేయనుండటంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపనున్నది.