ముంబై, డిసెంబర్ 24 : దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గుచూపడం, ఎనర్జీ-ఐటీ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలను నష్టాలవైపు నడిపించాయి. రూపాయి విలువ పడిపోతుండటం, విదేశీ నిధులు తరలిపోతుండటం కూడా సూచీలపై ఒత్తిడిని పెంచాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. 85,738 పాయింట్ల నుంచి 85,342 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 116.14 పాయింట్లు కోల్పోయి 85,408.70 వద్ద ముగిసింది. మరో సూచీ నిప్టీ 35.05 పాయింట్లు కోల్పోయి 26,142.10 వద్ద నిలిచింది. ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న స్థబ్ధత, ముఖ్యంగా సెలవు రోజులు కావడంతోపాటు ఈ ఏడాది ముగింపు దగ్గర పడుతుండటంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు దూరంగా ఉండటం సూచీల్లో స్థబ్ధత నెలకొన్నదని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు. షేర్లలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. కానీ, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
క్రిస్మస్ సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. దీంతో ఈ వారంలో సూచీల ట్రేడింగ్ రోజులు 4 రోజులకు పరిమితంకానున్నది. మరోవైపు, రంగాలవారీగా ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, సర్వీసెస్, ఎనర్జీ రంగ షేర్లు నష్టపోగా..టెలికాం, రియల్టీ, మెటల్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు నష్టాలోకి జారుకున్నాయి.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో నమోదిత పెట్టుబడిదారులు భారీగా తగ్గారు. 2025 లో కేవలం 1.51 కోట్ల ఖాతాలు మాత్రమే ప్రారంభించబడ్డాయని తాజా నివేదికలో వెల్లడించింది. 2021 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం విశేషం. 2024 లో నమోదైన ఖాతాలతో పోలిస్తే 36 శాతం తగ్గుముఖం పట్టగా, 2023 కంటే 1.6 శాతం తక్కువని పేర్కొంది. ఈ నెల 19 నాటికి ఎన్ఎస్ఈలో నమోదిత ఇన్వెస్టర్ల సంఖ్య 12.4 కోట్లుగా నమోదైంది. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతోపాటు ప్రాంతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు కేవలం 9 శాతం మాత్రమే వృద్ధిని సాధించాయి.