ముంబై, డిసెంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు కోలుకున్నాయి. గత వారం మొత్తంగా నష్టాల్లోనే కొట్టుమిట్టాడిన సూచీలు.. ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం ఉదయం ఆరంభం నుంచే మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేశారు. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 498.58 పాయింట్లు లేదా 0.64 శాతం పుంజుకొని 78,540.17 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 876.53 పాయింట్లు ఎగబాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 165.95 పాయింట్లు లేదా 0.70 శాతం ఎగిసి 23,753.45 వద్ద స్థిరపడింది. దీంతో 5 రోజుల వరుస నష్టాలకు తెరపడినైట్టెంది.
బ్యాంకింగ్ రంగ షేర్లు మెరిశాయి. మదుపరులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ ఇండీసెస్ 1 శాతం పెరిగింది. మెటల్, చమురు-గ్యాస్ రంగాల షేర్లూ ఎగిశాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది శనివారం అవుతున్నది. సాధారణంగా శని, ఆదివారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు దినాలు. కానీ ఫిబ్రవరి 1 శనివారమైనా.. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వార్షిక బడ్జెట్ ప్రకటించనుండటంతో ఆ రోజున మార్కెట్లు ఎప్పట్లాగే ట్రేడ్ అవుతాయని అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈ వర్గాలు సోమవారం స్పష్టం చేశాయి.
ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ట్రేడింగ్ ఉంటుందని ఓ సర్క్యులర్‌లో పేర్కొన్నాయి. కాగా, గతంలో 2015 ఫిబ్రవరి 28, 2020 ఫిబ్రవరి 1ల్లో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రకటించనప్పుడూ అవి శనివారాలే. అయినా మార్కెట్లు నడిచాయి. 2001లో కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయం సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మారిన దగ్గర్నుంచి స్టాక్ మార్కెట్లు బడ్జెట్ ఏ రోజైతే ఆ రోజు తప్పక ట్రేడింగ్‌ను జరుపుతూ వస్తున్నాయి.