Stock Market : భారత స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్లో కంపెనీల బైబ్యాక్‌పై పన్ను విధించడం, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను (STT) పెంచడం మార్కెట్లను కుదిపేసింది. ఒక దశలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ 2000 పాయింట్లపైగా పతనమైంది. చివరకు సెన్సెక్స్ 1546 పాయింట్లు పతనమై 80,722 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 495 పాయింట్లు నష్టపోయి 24,119 పాయింట్ల వద్ద ముగిసింది.
కాగా బడ్జెట్ నేపథ్యంలో ఇవాళ ఆదివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. ఇవాళ్టి ట్రేడింగ్ మదుపర్లకు బ్లాక్సండేను మిగిల్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఫ్లాట్‌గా ట్రేడయిన సూచీలు.. ఎస్టీటీ ప్రస్తావన తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయి ఉండే సెక్యురిటీలను కొనుగోలు, అమ్మకాలు చేసేటపుడు వర్తించే పన్ను ఎస్టీటీ. దీనిని బడ్జెట్లో 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచారు.
ఇక ఆప్షన్స్ ప్రీమియంపై ఎస్టీటీని 0.15 శాతానికి పెంచారు. ఆ బైబ్యాక్స్‌ను మూలధన లాభాలుగా పరిగణిస్తూ పన్ను విధించారు. అక్రమ వినియోగానికి చెక్‌పెట్టే ఉద్దేశంతో బైబ్యాక్ పన్నుల్లో మార్పును నిర్మలమ్మ ప్రతిపాదించారు. కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్లపై 22 శాతం, నాన్ కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్‌పై 30 శాతం పన్నులు విధించారు. ఇది మదుపర్ల సెంటిమెంట్‌ను భారీగా దెబ్బతీసింది.
సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటించడంతో బ్రోకరేజీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్‌ను 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో 18 శాతం వరకు ఆయా కంపెనీల షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈలో మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX) షేర్లు 18.08 శాతం పతనమై రూ.2,068కి చేరాయి.
గ్రో మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్ గ్యారెజీ వెంచర్స్ షేర్లు 13 శాతం పతనమై రూ.154కి దిగివచ్చాయి. ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ 10.4 శాతం క్షీణించి రూ.296.10కి చేరింది. యాంజెల్ వన్ స్టాక్ కూడా 11.84 శాతం నష్టపోయి 2,237.95, ఆనంద్ రాఠీ అండ్ స్టాక్ బ్రోకర్స్ 8.5 శాతం క్షీణించి రూ.532.15కి చేరాయి. ఆఖరికి బీఎస్ఈ లిమిటెడ్ షేరు విలువ కూడా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. ఎన్ఎస్ఈలో దీని విలువ 15 శాతం కోల్పోయి రూ.2,377కు చేరింది.
నిఫ్టీ సూచీలో మ్యాక్స్ హెల్త్‌కేర్, విప్రో, టీసీఎస్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. హిందాల్కో, ఎస్బీఐ, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.