దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టపుటేరులు ప్రవహిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు.. మదుపరులలో గుబులు పుట్టిస్తున్నాయి మరి. ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్లకు దూరంగా జరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ట్రేడ్ వార్ భయాలు సూచీలను కోలుకోనివ్వడం లేదు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశీయ స్టాక్ మార్కెట్లను వాణిజ్య యుద్ధం భయాలు చుట్టుముట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల హెచ్చరికలు.. అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేయగా, ఆ ప్రభావం భారతీయ ఈక్విటీలపైనా కనిపించింది. శుక్రవారం ఉదయం ఆరంభం నుంచే భారీ నష్టాల్లో కదలాడిన సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ మరింతగా పతనమైపోయాయి. ఈ క్రమంలోనే ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోయింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,414.33 పాయింట్లు లేదా 1.90 శాతం క్షీణించి 73,198.10 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 1,471.16 పాయింట్లు పడిపోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 420.35 పాయింట్లు లేదా 1.86 శాతం దిగజారి 22,124.70 దగ్గర స్థిరపడింది.
అమెరికాకు దిగుమతయ్యే చైనా ఉత్పత్తులపై అదనంగా మరో 10 శాతం టారిఫ్లుంటాయంటూ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన.. యావత్తు మార్కెట్లలో ప్రకంపనల్ని సృష్టించింది. కేవలం దీనివల్లే భారతీయ సూచీలు 2 శాతం వరకు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికే పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాల నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలుంటాయని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా, తరలిపోతున్న విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, ట్రంప్ దూకుడుతో అగ్రరాజ్య ఆర్థికవ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు కూడా ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను బలహీనపర్చాయి. ట్రంప్ నిర్ణయాలు.. అమెరికాపై ప్రతీకార సుంకాలకు దారితీయవచ్చన్న గుబులు దేశ, విదేశీ మదుపరులను వెంటాడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టెక్ మహీంద్రా షేర్ విలువ అత్యధికంగా 6 శాతానికిపైగా నష్టపోయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లూ నిరాశపర్చాయి. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, మారుతి, టాటా మోటర్స్, టైటాన్, నెస్లే షేర్లూ పడిపోయాయి. రంగాలవారీగా టెక్, ఐటీ సూచీలు 4.20 శాతం, టెలికం, 4.09 శాతం, ఆటో 3.84 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.74 శాతం, చమురు-గ్యాస్ 2.61 శాతం, పవర్ 2.29 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. అమెరికా, ఐరోపా స్టాక్ మార్కెట్లూ ఇదే దారిలో పయనిస్తున్నాయి.
వరుస నష్టాల నడుమ బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.384 లక్షల కోట్లకు పరిమితమైంది. శుక్రవారం ఒక్కరోజే రూ.9,08, 798.67 కోట్లు పడిపోగా.. రూ. 3,84,01,411.86 కోట్లకు తగ్గింది. గడిచిన 5 నెలల్లో రూ.93.91 లక్షల కోట్లు క్షీణించింది. నిరుడు సెప్టెంబర్ ఆఖర్లో ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.4,77, 93,022.68 కోట్లుగా ఉండటం గమనార్హం. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితులతో మదుపరులు భయాందోళనకు గురవుతున్నారని, ఎఫ్ఐఐలతోపాటు దేశీయ సంస్థాగత మదుపరులూ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని మార్కెట్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరికొద్దిరోజులు ఇలాగే ఉంటుందన్న అంచనాలూ వస్తున్నాయి.