ముంబై, మే 28:సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేవారం విడుదలకానుండటంతో మదుపరుల్లో టెన్షన్ నెలకొన్నది. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా మూడోరోజు మంగళవారం సూచీలు నష్టపోయాయి. పవర్, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 75,170.45 వద్ద స్థిరపడింది. 75,585 నుంచి 75,083 శ్రేణిలో కదలాడిన సూచీలు చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 44.30 పాయింట్లు కోల్పోయి 22,888.15 వద్దకు పడిపోయింది. ఎన్నికల ఫలితాల వరకు స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగనున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
డిసెంబర్ నాటికి 24,500కి నిఫ్టీ
ఈ ఏడాది చివరినాటికి నిఫ్టీ 24,500 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని ఎంకీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అంచనావేస్తున్నారు. ఇదే క్రమంలో వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 26,500 పాయింట్లను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. ప్రస్తుతం 22,888 పాయింట్ల స్థాయిలో ఉన్నది. ఇటీవల రికార్డు స్థాయి 23,110 పాయింట్లకు చేరుకున్న విషయం తెలిసిందే.