ముంబై, జూన్ 5: దేశీయ ఈక్విటీ మార్కెట్లో లాభాల్లో కదలాడుతున్నాయి. సూచీలకు బ్లూచిప్ సంస్థల నుంచి మద్దతు లభించడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుప్పరించడంతో తిరిగి కోలుకున్నాయి. రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను అరశాతం తగ్గించే అవకాశాలుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ముందుకు నడిపించింది. ఇంట్రాడేలో 900 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 443.79 పాయింట్ల లాభంతో 81,442.04 వద్ద ముగియగా, నిఫ్టీ 130.70 పాయింట్లు అందుకొని 24,750.90 వద్ద నిలిచింది.
అమెరికా బాండ్ ఈల్డ్ తీవ్ర ఒత్తిడికి గురికావడంతో డాలర్ బలహీనపడటం కూడా మార్కెట్లకు కలిసొచ్చిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో అత్యధికంగా లాభపడిన షేర్లలో ఎటర్నల్ షేరు నిలిచింది. కంపెనీ షేరు 4.50 శాతం లాభపడింది. దీంతోపాటు పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఐటీసీ లాభాల్లో ముగిశాయి. కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్‌లు నష్టపోయాయి.