ముంబై, అక్టోబర్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం సూచీలు ఒడిదొడుకులకు లోనైనప్పటికీ మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో నిలబడ్డాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 484.53 పాయింట్లు లేదా 0.58 శాతం ఎగబాకి 83,952.19 వద్ద ముగిసింది. జూన్ 27 నుంచి ఈ స్థాయిని సూచీ తాకడం ఇదే తొలిసారి. నిజానికి ఇంట్రా-డేలో 704.58 పాయింట్లు పుంజుకొని 84 వేల మార్కుకు ఎగువన 84,172.24 వద్దకు వెళ్లింది. అయితే అమ్మకాల ఒత్తిడితో ఎంతో సమయం ఈ ఉత్సాహం కొనసాగలేకపోయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 124.55 పాయింట్లు లేదా 0.49 శాతం ఎగసి 52 వారాల గరిష్ఠాన్ని తాకుతూ 25,709.85 వద్ద నిలిచింది. సెన్సెక్స్ షేర్లలో ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా 4.18 శాతం పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హిందుస్థాన్ యునీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లూ మెప్పించాయి. రంగాలవారీగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఆటో, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, టెలికం, ఆర్థిక సేవలు, చమురు షేర్లు ఆకట్టుకున్నాయి. అయితే బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 0.49 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 0.43 శాతం పడిపోయాయి. ఇదిలావుంటే ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,451.37 పాయింట్లు లేదా 1.75 శాతం, నిఫ్టీ 424.5 పాయింట్లు లేదా 1.67 శాతం లాభపడ్డాయి.
దేశీయ మదుపరుల హవా
ఇక విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) పెట్టుబడుల జోష్‌తో ఉన్నారు. గురువారం రూ.997.29 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐ) రూ.4,076.20 కోట్ల పెట్టుబడుల్ని పెట్టారు. గతకొంత కాలం నుంచి విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లపట్ల నిరాసక్తిని ప్రదర్శిస్తున్నా.. దేశీయ మదుపరులు మాత్రం విశ్వాసాన్ని చూపుతున్నారు. ఇదిలావుంటే జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దక్షిణ కొరియా సూచీ లాభపడింది.
మిడ్వెస్ట్ ఐపీవోకి 88 రెట్ల బిడ్డింగ్
రాష్ర్టానికి చెందిన ప్రముఖ గ్రానైట్ గనుల నిర్వహణ సంస్థ మిడ్వెస్ట్ లిమిటెడ్ ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. కంపెనీ జారీ చేసిన షేర్లకు 88 రెట్ల బిడ్డింగ్ దాఖలయ్యాయి. రూ.451 కోట్ల నిధుల సేకరణ కోసం 31,17,460 షేర్లను విక్రయానికి పెట్టగా, వీటికి 27,39,83,178 షేర్ల బిడ్డింగ్ దాఖలయ్యాయి. నికరంగా 87.89 రెట్ల అధికంగా బిడ్డింగ్ నమోదైందని ఎన్ఎస్ఈ డాటా వెల్లడించింది. ఇప్పటికే నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ 168.07 రెట్ల సబ్‌స్ర్కైబ్ కాగా, అలాగే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్ బయ్యర్లు(క్యూఐబీ) 139.87 రెట్లు, రిటైల్ ఇండివిజ్వల్ ఇన్వెస్టర్లు 24.26 రెట్లు బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. షేరు ధరల శ్రేణిని రూ.1,014-1,065 మధ్యలో నిర్ణయించింది. ఈ ఐపీవోల భాగంగా తాజా షేర్లను విక్రయించడం ద్వారా రూ.250 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మరో రూ.201 కోట్లు సమీకరించినట్టు అయింది. సంస్థకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ల్లో 16 గ్రానైట్ గనులు ఉన్నాయి.