Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లకుపైగా నష్టపోయింది. ఆర్బీఐ గురువారం మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం నిర్ణయాలను గురువారం వెల్లడించింది. దీనికి ముందు మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. వరుసగా తొమ్మిదిసారి ఆర్బీఐ పాలసీ రెపోరేటును యథాతథంగా కొనసాగాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఆహార ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో రెపో రేటును 6.5శాతం వద్ద యథాతధంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కీలకమైన వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవడంతో సూచీలు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. మరో వైపు యూఎస్ మార్కెట్ల ప్రతికూల పవనాలు సైతం దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపించాయి.
సెన్సెక్స్ ఉదయం క్రితం సెషన్‌తో పోలిస్తే 79,420.49 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఇంట్రాడేలో 79,626.92 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. కనిష్ఠంగా 78,798.94 పాయింట్లకు పతనమైంది. చివరకు 581.79 పాయింట్ల నష్టంతో 78,886.22 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 180.50 పాయింట్లు దిగజారి 24,117.00 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,702 షేర్లు పెరగ్గా.. మరో 1679 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో ఎల్‌టీఐఎండ్‌ట్రీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఇన్ఫోసిస్ నష్టాలను మూటగట్టుకున్నాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా నష్టపోయాయి. సెక్టోరల్‌లో ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. మెటల్, రియల్టీ, ఆయిల్, గ్యాస్, ఐటీ షేర్లు ఒకటి నుంచి రెండుశాతం వరకు క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పతనం కాగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.