Microsoft | న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా బహుళజాతి టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిలిచింది. ఈ ఏడాదికిగాను తాజాగా విడుదల చేసిన రాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ (ఆర్‌ఈబీఆర్)లో మైక్రోసాఫ్ట్‌ను ఎక్కువమంది ఉద్యోగులు ఇష్టపడ్డారు మరి. భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో స్థానంలో ఉండగా.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మూడో స్థానంలో స్థిరపడింది. ప్రధానంగా ఆర్థిక స్థితి, పేరు, కెరియర్ ఉన్నతికి ఉన్న అవకాశాలే ఆధారంగా ఈ సర్వే జరిగింది. ఇందులో మైక్రోసాఫ్ట్‌కు అత్యధిక స్కోర్ వచ్చినట్టు రాండ్‌స్టడ్ తెలియజేసింది. కాగా, ఈ స్వతంత్ర సర్వేలో దాదాపు 1,73,000 మంది పాల్గొన్నారు. ఇందులో భారత్‌కు చెందినవారు 3,507 మంది. 6,084 కంపెనీలపై సర్వే చేపట్టారు.
రంగాలవారీగా చూస్తే 77 శాతం మంది ఉద్యోగులు.. దేశీయ ఆటో రంగంలో కొలువుల్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. ఆ తర్వాత ఐటీ, కమ్యూనికేషన్, టెలికం, ఐటీ అనుబంధ రంగాలు (76 శాతం), ఎఫ్ఎంసీజీ, డ్యూరబుల్స్, రిటైల్, ఈ-కామర్స్ రంగాలు (75 శాతం), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, కన్సల్టింగ్ రంగాలు (74 శాతం) ఉన్నాయి. ఇక ఉద్యోగ-వ్యక్తిగత జీవితాల్లో సమతూకం, సమానత్వం, ఆకర్షణీయ వేత నం, ఇతరత్రా ప్రయోజనాలకు ఉద్యోగాల్లో చేరేటప్పుడు దేశీయ ఉద్యోగులు మిక్కిలి ప్రాధాన్యాన్ని ఇస్తున్నారని రాండ్‌స్టడ్ ఇండియా ఎండీ, సీఈవో విశ్వనాథ్ పీఎస్ తెలిపారు.
1 మైక్రోసాఫ్ట్
2 టీసీఎస్
3 అమెజాన్
4 టాటా పవర్
5 టాటా మోటర్స్
6 సామ్సంగ్
7 ఇన్ఫోసిస్
8 ఎల్అండ్టీ
9 రిలయన్స్ ఇండస్ట్రీస్
10 మెర్సిడెస్-బెంజ్