Stocks | ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయం వెలువడనుండటంతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణతో వరుసగా రెండో రోజు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు- బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-30 సూచీ సెన్సెక్స్ 213.12 పాయింట్ల నష్టంతో 78,058.16 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 427.29 పాయింట్లు (0.54 శాతం) పతనంతో 77,843.99 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు, ఎన్ఎస్ఈ-50లో 30 స్టాక్స్ నష్టంతో ముగియగా, నిఫ్టీ 92.95 పాయింట్లు (0.39శాతం) నష్టంతో 23,603.35 పాయింట్ల వద్ద స్థిర పడింది.
సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్టెల్, టైటాన్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐటీసీ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ భారీ నష్టాలతో ముగిశాయి. మరోవైపు, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ లాభ పడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) బుధవారం నాటికి ఈక్విటీ మార్కెట్లలో రూ.1,682.83 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించారు.
ఇక ద్రవ్య పరపతిపై ఆర్బీఐ ఎంపీసీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. శుక్రవారం వడ్డీరేట్లపై నిర్ణయం వెలువరించనున్నది. ‘ఇన్వెస్టర్లంతా ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షపై దృష్టిని కేంద్రీకరించారు. అంతర్జాతీయంగా ట్రేడ్‌వార్ నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గిస్తారన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు ఓ మోస్తరు నష్టాలతో ముగిశాయి. నెమ్మదించిన ఆర్థిక వృద్ధిరేటును ప్రోత్రహించడానికి ప్రభుత్వం వినియోగంపై దృష్టి సారించినా బ్రాడర్ మార్కెట్లు ఆచితూచీ స్పందిస్తున్నాయి’ అని జియో జిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూరోపియన్ యూనియన్ దేశాల్లోని స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక బుధవారం అమెరికా మార్కెట్లు లాభాలతో స్థిర పడ్డాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌పై 0.60 శాతం వృద్ది చెంది 75.06 డాలర్లకు చేరుకుంది.