ముంబై, జూన్ 9: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. వరుసగా రెండు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు రాణించడం, క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న అంచనాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి.
ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 394.50 పాయింట్లు ఎగబాకి 73,918.76 పాయింట్ల వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 74 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 119.10 పాయింట్లు అందుకొని 23,242.10 వద్ద స్థిరపడింది.
బ్యాంకింగ్ రంగ సూచీ దన్నుతోనూ సూచీలు కోలుకున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 5.65 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5.54 శాతం, కెనరా బ్యాంక్ 4.29 శాతం, ఇండియన్ బ్యాంక్ 3.90 శాతం, యూకో బ్యాంక్ 3.88 శాతం, పీఎన్బీ 3.69 శాతం, ఫెడరల్ బ్యాంక్ 3.40 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.24 శాతం, యూనియన్ బ్యాంక్ 3.09 శాతం, ఎస్బీఐ 2.13 శాతం ఎగబాకాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ 2.03 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్ 1.22 శాతం పెరిగాయి.