ముంబై, జూన్ 26: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ రికార్డు స్థాయిలో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికంగా లాభపడటంతో సూచీలు మరో మైలురాయికి చేరుకున్నాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 620.73 పాయింట్లు అందుకొని నూతన గరిష్ఠ స్థాయి 78,674.25 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 147.50 పాయింట్లు అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి 23,868.80 వద్ద నిలిచింది. దీంతో గత మూడు సెషన్లలో మదుపరుల సంపద రూ.2.53 లక్షల కోట్ల మేర పెరిగింది. 30 షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్‌లు అధికంగా లాభపడ్డాయి. కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. లార్జ్-క్యాప్ సూచీల్లో భారీ ర్యాలీ జరగడం వల్లనే సూచీలు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.