ముంబై, జూలై 29 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు తెరపడింది. బ్లూచిప్ సంస్థలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో సూచీలు కదంతొక్కాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 446.94 పాయింట్లు అందుకొని తిరిగి 81 వేల పాయింట్ల పైకి ఎగిసింది. చివరకు 81,337.85 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ సైతం 140.20 పాయింట్లు ఎగబాకి 24,821.10 వద్ద ముగిసింది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై ప్రతిష్ఠంభన నెలకొన్నప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారని, వచ్చే నెల 1న అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల తగ్గింపుపై ప్రకటన చేసే అవకాశం ఉండటం సూచీల్లో జోష్ పెంచిందని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
రిలయన్స్ షేరు దూసుకుపోయింది. కంపెనీ షేరు 2.21 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, భారతీ ఎయిర్టెల్, టాటా మోటర్స్ షేర్లు ర్యాలీ కొనసాగించాయి. అలాగే ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, మారుతి, బజాజ్ ఫైనాన్స్‌లు లాభపడగా..యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టైటాన్, ఐటీసీలు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే రియల్టీ రంగ సూచీ అత్యధికంగా 1.64 శాతం లాభపడగా, టెలికాం 1.50 శాతం, ఎనర్జీ 1.22 శాతం, ఇండస్ట్రియల్స్ 1.20 శాతం, హెల్త్‌కేర్ 1.15 శాతం, కమోడిటీస్ 1.05 శాతం, వాహన రంగ సూచీలు లాభాల్లో ముగిశాయి.
భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్న దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు భారీ షాక్ తగిలింది. గడిచిన రెండు రోజుల్లో కంపెనీ షేరు భారీగా పడిపోవడంతో రూ.28 వేల కోట్ల మార్కెట్ విలువ హారతి కర్పూరంలా కరిగిపోయింది. సోమవారం 2 శాతం నష్టపోయిన షేరు, మంగళవారం ఒక్క శాతం వరకు కోల్పోయింది. దీంతో గడిచిన రెండు రోజుల్లో టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.28,148.72 కోట్లు కరిగిపోయి రూ.11,05,886.54 కోట్లకు పడిపోయింది.