Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకుతున్నాయి. ఎనిమిది రోజుల తర్వాత.. సోమవారం స్వల్ప లాభాల్లో ముగియగా.. మంగళవారం మళ్లీ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, పవర్ రంగాల సూచీలు రాణించి.. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న భయాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఫలితంగా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. గత సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ మంగళవారం ఉదయం 76,073.71 స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జరుకున్నాయి. మధ్యాహ్నానికి కోలుకొని స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
ఇంట్రాడేలో 75,531.01 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 76,091.69 పాయింట్లకు పెరిగింది. చివరకు 29.47 పాయింట్ల నష్టంతో 75,967.39 వద్ద ముగిసింది. నిఫ్టీ 14.20 పాయింట్లు తగ్గి.. 22,945.30 స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 993 షేర్లు పెరగ్గా.. మరో 2,804 షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.7శాతం క్షీణించాయి. నిఫ్టీలో ట్రెంట్, ఇండస్ ఇండ్ బ్యాక్, ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. టెక్ మహీంద్రా, విప్రో, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ లాభపడ్డాయి. సెక్టార్లలో ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.5-1 శాతం మధ్య పతనమవగా.. ఐటీ, పవర్, ఆయిల్, గ్యాస్ ఇండెక్స్ 0.5శాతం చొప్పున పెరిగాయి.