న్యూఢిల్లీ, మే 4: రిజర్వ్‌బ్యాంక్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా హఠాత్తుగా రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించడంతో బుధవారం స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఇన్వెస్టర్లు ఎడాపెడా విక్రయాలు జరపడంతో బీఎస్ఈ సెన్సెక్స్ భారీగా 1,307 పాయింట్లు పతనమై రెండు నెలల కనిష్ఠస్థాయి 55,669 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 391.50 పాయింట్లు నష్టపోయి 16,677 పాయింట్ల వద్ద ముగిసింది. రిజర్వ్‌బ్యాంక్ రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచగా, వ్యవస్థలో లిక్విడిటీని అదుపుచేసే సీఆర్ఆర్ను అరశాతం పెంచింది.
మరో వైపు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సైతం వడ్డీ రేట్లను పెంచనుండటం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు తదితర అంశాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ మానిటరీ కమిటీ చేపట్టిన చర్య సబబే అయినప్పటికీ, ప్రకటించిన సమయం సరైనదని కాదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ చెప్పారు. ఎల్ఐసీ ఐపీవో ప్రారంభమైన రోజే ఆర్బీఐ నిర్ణయం వెలువడటం ఆశ్చర్యకరమన్నారు. ఆర్బీఐ తొలుత ద్రవ్యోల్బణాన్ని తక్కువగా అంచనా వేసిందని, ద్రవ్య విధానాన్ని మార్పుచేయడంలో వెనుబడిందని జూలియస్ బేర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ కులకర్ణి చెప్పారు.
బజాజ్ ద్వయం 4 శాతం డౌన్
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా బజాజ్ గ్రూప్ షేర్లు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు 4.25 శాతంపైగా నష్టపోయాయి. టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, మారుతి షేర్లు 2.5-4 శాతం మధ్య క్షీణించాయి.
రూ.6.27 లక్షల కోట్ల సంపద నష్టం
తాజా మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.6.27 లక్షల కోట్ల భారీ నష్టాన్ని చవిచూశారు. బీఎస్ఈలో లిస్టయిన మార్కెట్ కంపెనీల విలువ రూ.6,27,359 కోట్లు తగ్గి, రూ.2,59,60,852 కోట్లకు పడిపోయింది.