ముంబై, నవంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లకు ధరాఘాతం తగిలింది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఏకంగా 14 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 6.21 శాతానికి చేరడంతో బుధవారం సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) సూచీ సెన్సెక్స్ 984.23 పాయింట్లు లేదా 1.25 శాతం క్షీణించి 77,690.95 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 1,141.88 పాయింట్లు లేదా 1.45 శాతం పడిపోవడం గమనార్హం. దీంతో వరుసగా రెండోరోజూ సూచీ నష్టాలకే పరిమితమైనైట్టెంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 324.40 పాయింట్లు లేదా 1.36 శాతం దిగజారి 23,559.05 వద్ద నిలిచింది. ఫలితంగా వరుసగా ఐదోరోజూ సూచీ పతనమైనైట్టెంది. కాగా, తరలిపోతున్న విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
రంగాలవారీగా..
ఆర్థిక, ఆటో, రియల్టీ, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, సర్వీసెస్, మెటల్, కమోడిటీస్ షేర్లు 3.23 శాతం నుంచి 2.45 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు తీవ్రంగా క్షీణించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలూ నిరాశపర్చాయి. 2.56 శాతం, 3.08 శాతం చొప్పున నష్టపోయాయి. కీలక ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టపోగా, చైనా మాత్రం లాభపడింది.
రూ.13 లక్షల కోట్లు మాయం
స్టాక్ మార్కెట్లలో రెండు రోజులుగా చోటుచేసుకున్న నష్టాలు.. మదుపరుల సంపదను పెద్ద ఎత్తునే మింగేశాయి. సెన్సెక్స్ వరుసగా రెండు రోజుల్లో 1,805.20 పాయింట్లు పడిపోయిన నేపథ్యంలో బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.13,07,898.47 కోట్లు హరించుకుపోయింది. దీంతో రూ.4,29,46,189.52 కోట్ల వద్ద స్థిరపడింది.