Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లతో మార్కెట్లు రాణించాయి. ప్రపంచ సవాళ్లు, ఆర్థిక మందగమనం మధ్య 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు 6.2శాతంగా నమోదైన నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ తొలిసారి జీవితకాల గరిష్ఠానికి పెరిగింది. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ ఉదయం రికార్డు స్థాయిలో 300 పాయింట్లకుపైగా లాభంతో 82,725.28 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి స్వల్పంగా దిగివచ్చింది. చివరకు 194.07 పాయింట్ల లాభంతో 82,559.84 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 42.80 పాయింట్ల లాభంతో 25,278.70 వద్ద ముగిసింది.
సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తొలిసారిగా రికార్డు స్థాయిలోనే ప్రారంభం కావడం విశేషం. ట్రేడింగ్‌లో దాదాపు 1,684 షేర్లు పురోగమించగా.. 2191 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, నెస్లే ఇండియా నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, మెటల్, హెల్త్‌కేర్, టెలికాం, మీడియా 0.4-1.6 శాతం పతనమయ్యాయి. బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం తగ్గింది.