ముంబై, మార్చి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ సూచీలు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ దేశీయ మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు ఒక్కశాతానికి పైగా లాభపడ్డాయి. ప్రస్తుత సంవత్సరంలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నట్లు అంచనాలు వెలువడంతో గ్లోబల్ మార్కెట్లు పోటెత్తాయి. దీంతోపాటు బ్లూచిప్ సంస్థల షేర్లు ర్యాలీతో సూచీలు భారీగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చిరకు 899 పాయింట్లు లేదా 1.19 శాతం లాభపడి 76 వేల మార్క్‌ను తిరిగి అధిగమించింది. చివరకు 76,348.06 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 283.05 పాయింట్లు లేదా 1.24 శాతం ఎగబాకి 23 వేల పైకి 23,190.65 పాయింట్లను అధిగమించింది. 2025లో ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను రెండు సార్లు తగ్గించే అవకాశాలుండటంతో ఎఫ్ఐఐలు అమ్మకాలను నిలిపివేయడం సూచీలకు కలిసొచ్చిందని జియోజిట్ ఫైనాన్షియల్ అధినేత వినోద్ నాయర్ తెలిపారు.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలతో మదుపరులు పండుగచేసుకుంటున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో సెన్సెక్స్ రికార్డు స్థాయిలో లాభపడుతుండటంతో రూ.17.43 లక్షల కోట్ల సంపద పెరిగింది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 2,519.15 పాయింట్లు లేదా 3.41 శాతం లాభపడింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.17,43,418.8 కోట్లు పెరిగి రూ.4,08,61,851.73 కోట్లు(4.73 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది.