ముంబై, మార్చి 4: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు స్టాక్ మార్కెట్ నష్టాల సెగ గట్టిగానే తగులుతున్నది. దేశీయ సంస్థాగత మదుపర్లలో అతిపెద్దదైన ఎల్ఐసీకి ఘనమైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియోనే ఉన్నది. అయితే 310కిపైగా షేర్లతో కూడిన ఈ పోర్ట్‌ఫోలియో వాల్యూ.. గతకొంత కాలంగా క్షీణిస్తున్న స్టాక్ మార్కెట్లతో భారీగానే ఆవిరైపోతున్నది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దాదాపు రూ.1.5 లక్షల కోట్లు హరించుకుపోవడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్ ఆఖరునాటికి సుమారుగా రూ.14.9 లక్షల కోట్లుగా ఉన్న ఎల్ఐసీ స్టాక్ పోర్ట్‌ఫోలియో విలువ.. గత నెల చివర్లో దాదా పు రూ.13.4 లక్షల కోట్లకు పరిమితమైంది. దీంతో కేవలం జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.1.45 లక్షల కోట్లు పడిపోయినైట్టెంది.
ఇదీ సంగతి..
ఇంచుమించుగా ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టిన అన్ని కంపెనీల షేర్లు నష్టాలనే పంచుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లతోపాటు లార్జ్‌క్యాప్ షేర్లూ నిరాశపరుస్తున్నాయి. ఐటీసీ విషయానికే వస్తే.. ఈ కంపెనీ షేర్లపై ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ ఏకంగా రూ.17వేల కోట్లపైనే పడిపోయింది. టీసీఎస్ (4.75 శాతం), ఇన్ఫోసిస్ (10.58 శాతం)ల్లోనూ వాటాలుండగా, రూ.18వేల కోట్లకుపైగా పోయాయి.
ఆర్థిక రంగంలో..
ఎస్బీఐ (9.13 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (7.14 శాతం), జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (6.10 శాతం)ల్లోనూ ఎల్ఐసీకి పెద్ద ఎత్తునే వాటాలున్నాయి. మార్కెట్ నష్టాలతో రూ.15వేల కోట్లకుపైగా నష్టాలు వచ్చిపడ్డాయి. ఎల్అండ్టీ, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తదితర షేర్లూ.. గడిచిన 2 నెలల్లో రెండంకెల స్థాయి శాతాల్లో నష్టాలు మిగిల్చాయి. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా దాదాపు అన్నింటి వాటాలూ దిగజారాయి. కాగా, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, అమ్మకాల ఒత్తిళ్లను చూస్తుంటే.. ఎల్ఐసీకి మరిన్ని నష్టాలు తప్పేలా లేవు. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) అదేపనిగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం, చిన్న, మధ్యశ్రేణి షేర్లు బలహీనపడుతుండటం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది.
పాలసీదారుల నమ్మకానికి పరీక్ష
బీమా అంటే ఎల్ఐసీ.. ఎల్ఐసీ అంటే బీమా. భారతీయులకు ఈ సంస్థపై అంతటి ధీమా మరి. ఇక ప్రభుత్వ రంగ సంస్థ కావడం, ఏండ్ల తరబడి సేవలు అందిస్తుండటం, పట్టణాలు-గ్రామాలు అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా లక్షలాది ఏజెంట్లు, కోట్లాది కస్టమర్లు కలిగి ఉండటం ఎల్ఐసీకి కలిసొచ్చే అంశం. సామాన్యులు ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు తమ కష్టార్జితాన్ని ఎంతో ఇష్టంగా ఎల్ఐసీలో పెట్టి నిశ్చింతగా ఉంటారంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే మోదీ సర్కారు స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడంతో ఇప్పుడు ఈ నమ్మకం అందరిలోనూ సడలుతున్న దుస్థితి. ఇంకా చెప్పాలంటే ఎల్ఐసీ పెట్టుబడి వ్యూహాలు.. పాలసీదారుల రాబడులపైనే అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి గట్టిగా వస్తుండటం ఒకింత భయాందోళనల్నే కలిగిస్తున్నాయి.