న్యూఢిల్లీ, జనవరి 10: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుసగా మూడు రోజులుగా భారీ నష్టాల్లో ట్రేడవుతుండటంతో మదుపరులు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోతుండటం, త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు నిస్తేజంగా ఉండటంతో గత మూడు రోజుల్లో రూ.12 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 820.2 పాయింట్లు లేదా 1.04 శాతం నష్టపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.12,07,314.99 కోట్లు కరిగిపోయి రూ.4,29,67,835.05 కోట్లు(5 ట్రిలియన్ డాలర్లు)కు తగ్గింది. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం, డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం కూడా మార్కెట్ల పతనానికి కారణం.
మరోవైపు, వారాంతం ట్రేడింగ్‌లో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 241.30 పాయింట్లు నష్టపోయి 77,378.91 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 95 పాయింట్లు కోల్పోయి 23,431.50 వద్ద నిలిచింది. మార్కెట్లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, పవర్గ్రిడ్లు అత్యధికంగా నష్టపోయాయి. మరోవైపు, టీసీఎస్ షేరు 6 శాతం పెరిగి టాప్‌గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే పవర్ అత్యధికంగా 3.07 శాతం నష్టపోగా, యుటిలిటీ 2.86 శాతం, రియల్టీ 2.64 శాతం, ఇండస్ట్రీయల్స్ 2.08 శాతం, కమోడిటీస్ 2.05 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.98 శాతం నష్టపోయాయి. కానీ, ఐటీ 3.17 శాతం, టెక్నాలజీ 2.24 శాతం చొప్పున లాభపడ్డాయి.