ముంబై, నవంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. బ్యాంకింగ్, ఐటీ, వాహన షేర్ల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ సూచీలు లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులుగా నష్టపోయిన సూచీలు ప్రారంభం నుంచే లాభాల బాట పట్టాయి. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 239.37 పాయింట్లు అందుకొని 77,578.38 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ ఏడు రోజుల పతనం నుంచి లాభాల్లోకి మళ్లింది. మార్కెట్ ముగిసే సమయానికి 64.70 పాయింట్లు అందుకొని 23,518.50 వద్ద స్థిరపడింది. గత ఏడు సెషన్లలో నిఫ్టీ 1,030 పాయింట్లు లేదా 4.3 శాతం పతనం కాగా, సెన్సెక్స్ 3,000 పాయింట్లు తగ్గి 77,300కి పడిపోయిన విషయం తెలిసిందే. ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గుచూపడం, కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు, అమెరికా బాండ్ ఈల్డ్ బలపడటం సూచీల పతనానికి ప్రధాన కారణాలు. మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, టాటా మోటర్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడగా..రిలయన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి.