Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం పాజిటివ్ ధోరణి నెలకొంది. దీంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా లాభంతో ముగిశాయి. అన్ని సెక్టార్ల స్టాక్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ ఇండెక్స్ మూడు శాతం, ఆటో, రియాల్టీ ఇండెక్సులు రెండు శాతం పుంజుకున్నాయి. బ్యాంకు ఇండెక్స్ కూడా లాభాలతోనే ముగిసింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1330.96 పాయింట్లు (1.68 శాతం) పుంజుకుని 80,436.84 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 397.40 పాయింట్ల వృద్ధితో 24,541.15 పాయింట్ల (1.65 శాతం) వద్ద స్థిర పడింది.
నిఫ్టీ-50 ఇండెక్సులో 50 స్టాక్స్ కు గాను 47 స్టాక్స్ అధిక లాభాలతో ముగిశాయి. విప్రో, టెక్ మహీంద్రా, గ్రాసిం, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ 4.23 శాతం లాభ పడ్డాయి. బీఎస్ఈ-30లో 30 స్టాక్స్ కు గాను 29 అధిక లాభాలు గడించాయి. వాటిలో టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్ 3.94 శాతం పుంజుకున్నాయి. ఇండియా వీఐఎక్స్ 14.40 పాయింట్లు (6.18 శాతం) నష్టపోయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.5 శాతానికి పైగా లాభ పడ్డాయి.