ముంబై, మే 14: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 182.34 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 81,330.56 వద్ద స్థిరపడింది. ఒకానొక దశాలో 81,691.87 స్థాయిని తాకడం విశేషం. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 88.55 పాయింట్లు లేదా 0.36 శాతం అందుకుని 24,666.90 వద్ద నిలిచింది.
గత నెల ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఆరేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 3.16 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. ఇవి మదుపరులను పెట్టుబడుల దిశగా నడిపించాయి. ఇక ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. జపాన్ సూచీ మాత్రం నష్టపోయింది.