Stock Market | బెంచ్‌మార్క్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ వారం చివరలో ఆర్బీఐ మనీమానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ప్రకటించనున్నది. అయితే, వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, దీనికి ముందు విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ క్రమంలో మార్కెట్లు స్వల్పంగా అస్థిరతకు గురయ్యారు. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏడు పైసలు తగ్గి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 88.79 వద్ద ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా పతనమైంది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ ఉదయం 80,588.77 లాభాల్లో మొదలైంది.
మధ్యాహ్నం ఒక్కసారిగా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి సెషన్లో మార్కెట్లు కోలుకోవడంతో నష్టాలు తగ్గాయి. ఇంట్రాడేలో 80,851.38 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 80,248.84 పాయింట్ల కనిష్టానికి చేరింది. చివరకు 61.52 పాయింట్ల నష్టంతో 80,364.94 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 19.80 పాయింట్లు తగ్గి 24,634.90 వద్దకు ముగిసింది. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల కారణంగా నిఫ్టీ వరుసగా ఏడు ట్రేడింగ్ సెషన్లలో 3శాతానికి పైగా పడిపోయింది. సెన్సెక్స్‌లో మారుతి, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎఅండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, హిందూస్తాన్ యూనిలీవర్ నష్టపోయాయి. టైటాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎటర్నల్, ట్రెంట్ లాభాలను ఆర్జించాయి. ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, ఎనర్జీ, రియాలిటీ రంగాల్లో ఒక్కొక్కటి ఒకశాతం పెరిగాయి, మీడియా ఇండెక్స్ దాదాపు ఒకశాతం తగ్గింది.
జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ మాట్లాడుతూ.. దేశీయ మార్కెట్ ఎలాంటి స్థిరత్వం లేకుండా అస్థిరంగా ముగిసిందని పేర్కొన్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులు ఉపసంహరించుకోవడడంతో పెట్టుబడిదారులు జాగ్రత్తపడుతున్నారని పేర్కొన్నారు. యూఎస్-భారత్‌పై వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం, ఐటీ, ఫార్మా ఇండెక్స్‌పై దీర్ఘకాలిక ఒత్తిడి ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇదిలా ఉండగా.. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సానుకూలంగా ముగిశాయి. జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ పతనమైంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 1.25 శాతం తగ్గి 69.25 డాలర్లకు చేరుకుంది.