Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీనతలు, వారాంతపు డెరివేటివ్స్ ఎక్స్పైరీ తదితర కారణాలతో వరుసగా నాలుగో రోజు దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 230 పాయింట్ల నష్టంతో 61,750 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 76.25 పాయింట్ల నష్టంతో 18,343.22 పాయింట్ల వద్ద స్థిర పడింది. బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో 22 స్టాక్స్ నష్టాలను చవి చూశాయి. పేటీఎం షేర్ 10 శాతానికి పైగా నష్టపోయింది. స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన పేటీఎం మాతృసంస్థ వన్99 కమ్యూనికేషన్స్ లాకిన్ పీరియడ్ ముగియడంతో ఆ సంస్థలో వాటాదారు సాఫ్ట్ బ్యాంక్.. బ్లాక్ డీల్ ద్వారా 4.5 శాతం విక్రయించడంతో పేటీఎం షేర్లు భారీగా నష్టపోయాయి.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉదయం ట్రేడింగ్ ప్రతికూలంగా ప్రారంభమై చివరి వరకు అదే ధోరణితో కొనసాగింది. ట్రేడింగ్ ముగియడానికి గంట ముందు ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగిశాయి.
ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ లాభాలతో ముగిశాయి. టాటా సన్స్ అనుబంధ టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.52,894 వద్ద స్థిర పడగా, కిలో వెండి రూ.61,253 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.81.57 వద్ద స్థిర పడింది. బుధవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 52 వారాల ఆల్‌టైం గరిష్ట స్థాయిని తాకి 62,052.57 పాయింట్ల వద్దకు దూసుకెళ్లినా.. 107.73 పాయింట్ల నష్టంతో 61,980 పాయింట్ల వద్ద ముగిసింది.