Stock Market Close | భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ తొలిసారిగా రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 85వేల పాయింట్లకు చేరువ కాగా.. నిఫ్టీ 26వేల పాయింట్లకు చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుందన్న వార్తలు స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపునిచ్చింది. ఈ క్రమంలో ఆల్టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. ఇటీవల అమెరికా ఫెడ్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మళ్లీ నవంబర్ 7న ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ మార్కెట్లు వరుసగా గరిష్ఠాలకు చేరుతున్నాయి. సెన్సెక్స్ ఉదయం క్రితం సెషన్తో పోలిస్తే 84,651.15 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 84,607.38 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 84,980.53 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్నది.
సెన్సెక్స్ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. చివరకు 384.30 పాయింట్ల లాభంతో 84,928.61 వద్ద ముగిసింది. నిఫ్టీ 25,872.55 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గిన సూచీలు.. మధ్యాహ్నం వరకు మళ్లీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో 25,847.35 పాయింట్లు తగ్గిన నిఫ్టీ.. గరిష్ఠంగా 25,956 పాయింట్లకు చేరింది. చివరకు 148.10 పాయింట్ల లాభంతో 25,939.05 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 2,274 షేర్లు పురోగమించగా.. 1661 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో ఎంఅండ్ఎం, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటోకార్ప్ లాభపడ్డాయి. ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి. పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 3శాతం కంటే ఎక్కువ పెరిగింది. రియల్టీ ఇండెక్స్ 2శాతానికి వృద్ధిని నమోదు చేసింది. ఆటో, ఇంధనం, ఎఫ్ఎంసీసీ, మెటల్, ఫార్మా, మీడియా 0.5శాతం నుంచి ఒకశాతం పెరిగింది. అయితే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5శాతం పతనమైంది. బీఎస్ఈ, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7శాతం చొప్పున పెరిగాయి.