Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 73,757.23 పాయింట్ల వద్ద నష్టంతో మొదలైంది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుంది. ఒక దశలో 73,540.27 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్న సెన్సెక్స్.. ఇంట్రాడేలో 74,151.21 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. దాంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్ మళ్లీ పతనమైంది. చివరకు 27.09 పాయింట్ల నష్టంతో 73,876.82 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం 18.60 పాయింట్ల నష్టంతో 22,434.65 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2623 షేర్లు పురోగమించగా, 914 షేర్లు పతనమయ్యాయి. మరో 82 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. రియల్టీ ఇండెక్స్ 2.5 శాతం క్షీణించగా, ఆటో ఇండెక్స్ 0.4 శాతం పడిపోయింది. మరోవైపు పవర్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి ఒక్కో శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా ఇండెక్స్ 0.5 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం వరకు లాభపడ్డాయి.