Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో ముగిశాయి. వరుసగా ఐదో సెషన్లో లాభాలను నమోదు చేశాయి. తొలిసారిగా సెన్సెక్స్ 82వేల పాయింట్ల మార్క్‌ను దాటింది. అలాగే, నిఫ్టీ సైతం 25వేల పాయింట్లు దాటి జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో సెన్సెక్స్ 81,949.68 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. మొదట్లో సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్లకుపైగా లాభాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే స్వల్పంగా తగ్గాయి. ఇంట్రాడేలో 82,129.49 పాయింట్లకు చేరి ఆల్‌టైమ్ హైకి చేరుకోగా.. కనిష్ఠంగా 81,700.21 పాయింట్లకు తగ్గింది. చివరకు 126.20 పాయింట్ల లాభంతో 81,867.55 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 59.75 పాయింట్లు పెరిగి 25,010.90 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్, నిఫ్టీ తొలిసారిగా రికార్డు స్థాయిలో ముగిశాయి. ట్రేడింగ్‌లో దాదాపు 1,237 షేర్లు లాభపడగా.. 2,181 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్ప్, శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఎంఅండ్ఎం, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ నష్టాల్లో ముగిశాయి. సెక్టార్లలో ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, మీడియా, టెలికాం, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ 0.5-2 శాతం క్షీణించాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఎనర్జీరంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు ఒకశాతం చొప్పున పతనమయ్యాయి.