Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 70,968.10 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. పొద్దంతా లాభాల్లో కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 72,010.22 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 1,240.90 పాయింట్లు లాభంతో 71,941.57 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 21,737.60 వద్ద ముగిసింది.
ట్రేడింగ్‌లో దాదాపు 1,963 షేర్లు పురోగమించగా.. 1,393 షేర్లు పతనమయ్యాయి. మరో 95 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్ అత్యధికంగా లాభపడ్డాయి. సిప్లా, ఐటీసీ, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. రంగాల్లో చమురు, గ్యాస్ ఇండెక్స్ 5శాతం, పవర్ ఇండెక్స్ 3 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.7 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక శాతం పెరిగాయి.