Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాలతో పాటు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహనతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది. ఈ క్రమంలో మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సమయంలోనే 2శాతం మేర పెరిగాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా పెరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి 2వేలకుపైగా లాభాల్లో మొదలైంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత నాలుగు రోజుల పాటు మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ తిరిగి లాభాల్లోకి దూసుకెళ్లాయి. శనివారం భారతదేశం-పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహన కారణంగా పెట్టుబడిదారుల ఆందోళన కొంతవరకు తగ్గింది. దాని ప్రభావం సోమవారం కనిపించింది. స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే భారీగా పెరిగాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 2262.01 పాయింట్లు పెరిగి 81,716 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 697.9 పాయింట్లు పెరిగి 24,705.90 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది దాదాపు 2336 షేర్లు లాభపడగా.. 268 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎక్స్టర్నల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లాభాల్లో కొనసాగుతుండగా.. సన్‌ఫార్మా నష్టాల్లో ట్రేడవుతున్నది.